కదలిక
-------●-------
పరిగెత్తిన పదముల
వేగం పలికిన
పదాల జంటలు..
అలసి ఆగిపోకనీ
కదిలి సాగిపొమ్మనీ!
తెగ దూరం ఉందని
తప్పుకోమని
ఏదో చప్పుడు..
నడకకు దొరకని
దూరం ఏది?
ఆకాశానికి హస్తం
చాచి అర్థిస్తే
అవుతాయా పనులు?
ఆలోచనకు రూపం
ఆచరణే కదా!
శ్రమిస్తే ఈదజాలని
సముద్రమేది?
చిందిన ప్రతి
చెమటచుక్క
చెప్పినదే నగ్నసత్యం?
నరమెరిగితే నాసికం
అంతకు మించిన
సుగంధమేది?
దారిలో..
కంఠకాలు గుచ్చి
మంటపెడితే
వాటిని దాటి
ముందుకుపోయిన
సాహసం నీది!
కదలిక తోనే
మనిషి పరిణామం!
కదలిక తోనే
నూతన చేతనం!
/\ శిఖరం /\
●●●●●●●●●●●●●●●●
ఓ మనీషి! ఓ మనీషి!
అనేకానేకాలు తవ్వితీసి
చీకటిలో వెలుగు పోసి
కాలంతో కలిసి నడిచి
సాధించావ్ అనుకున్నది
అంతటా నీవై నిలిచి..
ఓ మనీషి! ఓ మనీషి!
బుద్ధిబల ఖడ్గధార
విప్పరాని చిక్కులు విప్పావ్
కొత్తకొత్తవి ఆవిష్కరించి
ఎగిరెళ్ళావ్ ఆకాశానికి
శాస్త్రసాంకేతికతలో ప్రగతి సాధించి..
ఓ మనీషి! ఓ మనీషి!
రాయిరప్పలో నుంచ
జీవకళను వెలికితీసి,
అనేకానర్థశబ్దాల నుంచి
స్వరాలెన్నో పలికించి
అనిపించావ్ కానిది లేదని నీ నుంచీ..
ఓ మనీషి! ఓ మనీషి!
ప్రకృతితో సహగమించి,
దాని కోపతాపాలకు ఓర్చి,
నిలిచావ్ నేడో
అత్యున్నత శిఖరంగా
ఆగక ముందుకు నడిచి..
ఓ మనీషి! ఓ మనీషి!
ఆకుల నుంచి అన్నం వరకు
గుహల నుంచి గృహాల వరకు
గృహాల నుంచి అన్య గ్రహాల వరకు
కొలవలేని దూరం నీ ప్రస్థానం
అలుపెరుగక సాగునదీ మహాప్రస్థానం
ఓ మనీషి! ఓ మనీషి!
విరతి లేని నీ
ప్రయాణానికి నా హారతి!

No comments:
Post a Comment