Friday, 18 January 2019

కవితలు (page 3)

పాలబుగ్గల పిల్లగాడ

---------------------------------------

ప్రైవేటు స్కూలు పిల్లగాడ
బరువు మోసె మొనగాడ
కుదురు దొరికి ఎన్నాళ్ళయిందో  ఓ పాలబుగ్గల పిల్లగాడ
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో

గాలి,వెలుతురు లేని గదులు
బల్ల చెంతనె పిల్లగాండ్లు
కంటి చూపు కాలం చెల్లిందా ఓ పాలబుగ్గల పిల్లగాడ
కొత్త బరువొక టొచ్చీ చేరిందా

కోడి కూయక ముందె లేచి
చిమ్మ చీకటి బాట నడిచి
టైముతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల పిల్లగాడ
టార్చిలైటే తోడై పోయిందా

ఆటలాడక కూరుచుండి
పాట పాడక మౌనముండి
చిన్న వయసునె ముసలై పోయావా ఓ పాలబుగ్గల పిల్లగాడ
సెల్లుఫోనె స్నేహితుడయ్యిందా




వేలవేలు ఫీజు కట్టి
చదువులేమో ఉత్త బట్టి
కొత్తదనమె లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల పిల్లగాడ
పాఠశాలె యమలోకమయ్యిందా

బుర్ర నిండే గుడ్డి చదువులు
వెర్రిలోకపు వింత రీతులు
మధ్యలో నిన్ను బలి చేస్తున్నాయా ఓ పాలబుగ్గల పిల్లగాడ
విద్య మొద్దు బరువై పోయిందా

పొద్దుగాలనె అమ్మ నీకు
కట్టెగా ఒక టిఫిను బాక్సు
ఖాళీ దొరకక తినలేకున్నావా ఓ పాలబుగ్గల పిల్లగాడ
కడుపు మాడి కన్నీరు పెట్టావా

కుక్క పిల్లల,చిన్న పక్షుల 
ముట్టుకొని మురిసిపోక
బొమ్మ చూసె సంబర పడ్డావా ఓ పాలబుగ్గల పిల్లగాడ
ఆధునిక యుగ అవతార మంటావా

చందమామ చూపి నీకు
అందమైన కథలు చెబుతు
తల్లి ముద్ద పెట్టి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల పిల్లగాడ
నువ్వు నిండుగా నవ్వి ఎన్నాళ్ళయిందో

మార్కులంటూ ర్యాంకులంటూ
పత్తి వోలె ఒత్తి వేస్తె
కంటనీరు కార్చక ఎడ్చావా ఓ పాలబుగ్గల పిల్లగాడ
కార్పొరేటు చదువులి వంటావా?



భగ్నహృదయం
-------------------
తన సఖి జతలో
వెలగాల్సిన హృదయం
వెలవెలబోయిందని..

తీరం దాటిన పడవై
మరో తీరం తెలియక
దూరాలను కొలుచుకుంటూ
ఒంటరి ఒంటై 
ప్రయాణం సాగిస్తున్నానని..

గతకాలపు 
చికిత్స కందని గాయాలు


తనను వేధిస్తూనే ఉన్నాయని
దానికి అతను రోధిస్తూనే ఉన్నాడని..

నాతో చెబుతుంటే విన్నాను --

అందమైన చందమామ
కురిపించిన వెన్నెలలో తడిసి
ఎండిన అడవి
ఆర్తనాదం!

ప్రేయసి చిదిమేసి,
చితిపేర్చిన భగ్నహృదయ
ప్రేమసంగీతం!


No comments:

Post a Comment